డాక్టర్ కడియం కావ్య గారికి పార్లమెంటరీ మహిళా సాధికారత స్థాయి కమిటీలో సభ్యురాలిగా చోటు దక్కడం తెలంగాణకు అరుదైన గౌరవంగా నిలిచింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన అంశాలపై కీలక సూచనలు చేసే ఈ ప్రతిష్ఠాత్మక కమిటీని లోక్‌సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కమిటీకి సీనియర్ పార్లమెంటేరియన్ పురందేశ్వరి అధ్యక్షత వహించనుండగా, లోక్‌సభ మరియు రాజ్యసభలకు చెందిన మహిళా ఎంపీలు సభ్యులుగా కొనసాగనున్నారు.
మహిళల భద్రత, విద్య, ఆర్థిక స్వావలంబన, ఉద్యోగావకాశాలు, లింగ సమానత్వం, సామాజిక రక్షణ వంటి కీలక అంశాలపై కమిటీ సమగ్ర అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. అలాగే మహిళా సాధికారత కోసం అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని సమీక్షిస్తూ, మహిళల ప్రాతినిధ్యం పెంపు మరియు హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
మహిళా సమస్యలపై డాక్టర్ కడియం కావ్య గారికి ఉన్న అవగాహన, సామాజిక అంశాలపై చూపుతున్న చొరవ దృష్ట్యా ఈ కమిటీలో ఆమె సేవలు కీలకంగా ఉండనున్నాయి.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, మహిళల సాధికారత, భద్రత, ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశాలను కమిటీలో బలంగా ప్రస్తావిస్తానని తెలిపారు. తెలంగాణ, ముఖ్యంగా వరంగల్ ప్రాంత మహిళల సమస్యలు మరియు అవసరాలను జాతీయ స్థాయిలో వినిపించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా తన వంతు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
