కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. రేవంత్ రెడ్డి ఒక ‘రెన్యూవల్ సీఎం’: కేటీఆర్

జీవో 17 రద్దుపై కేటీఆర్ సమరశంఖం.. కాంగ్రెస్ దగా రాజకీయాలపై ఇందిరా పార్క్ వేదికగా నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్!

admin
By admin
4 Min Read
జీవో 17 రద్దుపై కేటీఆర్ సమరశంఖం.. కాంగ్రెస్ దగా రాజకీయాలపై ఇందిరా పార్క్ వేదికగా నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్!

హైదరాబాద్ ఇందిరా పార్కు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై, కాంగ్రెస్ దగా రాజకీయాలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికల ముందు 72% రిజర్వేషన్ల హామీ.. అధికారం వచ్చాక 72 పైసలు కూడా ఇవ్వలేదు!

ఎన్నికలకు ముందు చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముంచిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

  • దగా చేసిన కాంగ్రెస్: ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% చొప్పున మొత్తం 72 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి, అధికారం లోకి వచ్చాక 72 పైసలు కూడా ఇవ్వకుండా అడ్డగోలు జీవోలు తెచ్చారని మండిపడ్డారు.
  • జీవో నెం.17 రద్దు వరకు పోరాటం: చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దక్కకుండా చేస్తూ ‘జీవో 17’ తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ టెండర్లను పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

కాంట్రాక్టులన్నీ ఇద్దరికే.. శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపులపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

  • బంధువులకే దోచిపెడుతున్నారు: ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని, రేవంత్ రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే అన్ని ఇస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ – నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును రేవంత్ తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు.
  • బీజేపీ ఎంపీకి రూ.1300 కోట్ల కాంట్రాక్టు: కాంగ్రెస్ పాలనలో వాళ్ల బంధువులకే కాకుండా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • డిమాండ్: రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు, చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉందా అని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఒక ‘రెన్యూవల్ సీఎం’ మాత్రమే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెక్కారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

“రేవంత్ రెడ్డి ఒక రెగ్యులర్ సీఎం కాదు, కేవలం ‘రెన్యూవల్ సీఎం’ (Renewal CM). ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నారు. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుంది. తెలంగాణా బడుగుల‌కు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణం. ఈ ద్రోహానికి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ హయాంలో సంపద సృష్టి – ‘తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్’

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ‘సంపద సృష్టించాలి-పేదలకు పంచాలి’ అనే దృక్పథంతో పనిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

  • నాడు చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుని గౌరవంగా నిలబెట్టారని, అప్పులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, 1000కి పైగా గురుకులాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించారని చెప్పారు.
  • 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, రైతులకు రూ.72 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని నేరుగా అందించిన ఘనత కేసీఆర్ దేనన్నారు.
  • “తాము చేతగాక కేసీఆర్ అప్పులు చేశాడని రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడు. హద్దుమీరి మాట్లాడితే ఊరుకునేది లేదని, తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు కేసీఆర్” అని గర్వంగా ప్రకటించారు.

2028లో మన ప్రభుత్వమే వస్తుంది.. 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం!

రాష్ట్రంలో మక్కలు, వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇవాళ ఏ ఒక్క ఊరికైనా కాంగ్రెస్ వాళ్లు వెళ్లే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టి, బొంద పెట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బడుగుల సమస్యలపై జంతర్ మంతర్ లేదా ఢిల్లీ వేదికగానైనా పోరాడుతామన్నారు. 2028లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, నాడు దాదాపు 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ గారు తీసుకుంటారని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Share This Article
No Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *