A. Revanth Reddy అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రివర్గం కీలక తీర్మానం చేసింది.
ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. పేదలకు గృహ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది.
జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్‌లో 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లు
హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.
పూరి గుడిసెల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాలకు ఇళ్లు
రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 15 వేల కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం, వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని నిర్ణయించింది. అత్యంత బలహీన వర్గాలకు గృహ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రివర్గం స్పష్టం చేసింది.
ఈ వివరాలను మంత్రులు Ponguleti Srinivasa Reddy, Adluri Laxman Kumar, Vakiti Srihari మీడియా సమావేశంలో వెల్లడించారు.
జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యార్థుల హాజరు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు పేద విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు
2027లో జరిగే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.1000 కోట్ల నిధులను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఘాట్లు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, భక్తులకు వసతి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నారు.
విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం
విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSS పథకంలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు రూపొందించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.587 కోట్లు
Palamuru – Ranga Reddy ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయాల కోసం రూ.587 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సంస్థల విలీనానికి ఆమోదం
రాష్ట్రంలోని అన్ని డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని, అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను హాకాలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పరిపాలన సులభతరం చేయడం, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడమే ఈ నిర్ణయాల లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ
2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్-5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో “నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30”కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దావోస్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ పాలసీ రూపొందించారు.
యువతకు భారీ అవకాశాలు
పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు తయారీ రంగంపైనే ఎక్కువ దృష్టి ఉండగా, ఇకపై ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించేలా పాలసీలో కీలక మార్పులు తీసుకువచ్చారు.

