తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరిస్తూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యా వారోత్సవాల’ వేదికగా కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి బిడ్డను తన సొంత బిడ్డలా చూసుకుంటామని, వారికి అత్యుత్తమ భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్: కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో రూ. 1011 కోట్లతో నిర్మించనున్న ఈ అత్యాధునిక పాఠశాలలకు సీఎం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 1700 కోట్లతో పేద విద్యార్థుల కోసం విద్యా ప్రణాళికలు సిద్ధం చేశారు.
- నర్సరీ నుంచి 12వ తరగతి వరకు: 10వ తరగతి తర్వాత డ్రాపౌట్స్ సమస్యను నివారించేందుకు, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యను అందించే నూతన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
- విదేశాలకు ఉపాధ్యాయులు: అంతర్జాతీయ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఏటా 500 మంది ఉత్తమ టీచర్లను జపాన్, సింగపూర్, వియత్నాం వంటి దేశాలకు పంపాలని సీఎం నిర్ణయించారు.
- బలవర్ధకమైన ఆహారం: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించనున్నారు. “ప్రభుత్వ బడి అంటే అమ్మ ఒడిలా ఉండాలి” అన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష.
- బడ్జెట్ పెంపు: విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తూ, బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులను 8.22% నుండి దశలవారీగా 15% వరకు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు.
- నాణ్యమైన వస్తువుల పంపిణీ: విద్యార్థులకు అందించే దుస్తులు, ఇతర వస్తువుల కోసం రూ. 1000 కోట్లు వెచ్చిస్తున్నామని, వీటి నాణ్యతలో లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదు.. అదొక భావోద్వేగం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి గురువు భాగస్వామి కావాలి.” — సీఎం రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి గారు రూ. 1 లక్ష చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేసి వారిని అభినందించారు.



