మహిళా సంఘాలకు మరో 3 వేల ఆర్టీసీ బస్సులు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

మహిళా సంఘాలకు మరో 3 వేల ఆర్టీసీ బస్సులు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

admin
By admin
3 Min Read
మహిళా సంఘాలకు మరో 3 వేల ఆర్టీసీ బస్సులు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం మహిళా శక్తి పథకం కింద టీజీఆర్టీసీకి అప్పగించిన 553 బస్సులకు అదనంగా రానున్న రోజుల్లో మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అందజేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల యాజమాన్యంలో కొనుగోలు చేసిన 553 బస్సులను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమాన్ని సీఎం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, త్వరలో ఆ సంఖ్యను కోటి మందికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

“కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకోను. జిల్లా, మండల, గ్రామ స్థాయి మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేస్తే వాటిని ఆర్టీసీకి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

2034 నాటికి కోటి మంది మహిళలు కోటీశ్వరులు

మహిళా శక్తికి ఈ ప్రభుత్వంలో ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి మహిళా సంఘాలతో సమావేశమవుతానని తెలిపారు.

మహిళా సంఘాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయంలో మార్పులు అవసరం

రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వడ్లు, మొక్కజొన్నలతో పాటు కందులు, మినుములు, పెసర్లు, కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని అన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం రూ.2,400 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రైతుల్లో అవగాహన పెంచడంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని కోరారు.

మహిళల పేరిటే ఆస్తులు

ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుమీదే మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. పట్టణాల్లో నిర్మించనున్న లక్ష ఇండ్లను కూడా మహిళల పేరిటే ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

“ఆస్తి ఏదైనా ఉంటే అది ఆడబిడ్డల పేరుమీదే ఉండాలి. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయి” అని పేర్కొన్నారు.

మహిళా సంక్షేమానికి భారీ మద్దతు

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.10,700 కోట్లకు పైగా చెల్లించిందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద రాష్ట్రంలోని 27 వేల పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించినట్లు తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, స్త్రీ శక్తి భవనాల ద్వారా మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.

స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ అందించామని, సున్నా వడ్డీ పథకం కింద బ్యాంకులకు రూ.2 వేల కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు.

చెక్కుల పంపిణీ

ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల కింద స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి చెక్కులను అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సుల అద్దె రూపేణా రూ.20.34 కోట్ల చెక్కు, మహిళల ఉచిత ప్రయాణ పథకం కింద రూ.10,700 కోట్ల ప్రయోజనాలు, వడ్డీ లేని రుణాల కోసం రూ.500 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు వేలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Share This Article
వ్యాఖ్యలు లేవు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి